భారత్‌లో కోవిడ్ మరణాలు తక్కువ సంఖ్యలో నమోదుకు కారణం ఇదే!

గతేడాది చైనాలో పురుడుపోసుకున్న ప్రాణాంతక కొత్తరకం కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. మహమ్మారి దెబ్బకు పేద, ధనిక దేశాలు అనే తేడా లేకుండా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇది కొత్తరకం వైరస్‌ కావడంతో పరిశోధనల్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం బయటపడింది. తక్కువ స్థాయిలో ఏసీల వాడకం, ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా సౌలభ్యం.. వైరల్‌ లోడ్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని ఏసియా పసిఫిక్‌ జర్నల్ ఆఫ్ పబ్లిక్‌ హెల్త్‌లో ప్రచురితమైన ఓ కథనం పేర్కొంది. ఈ సౌలభ్యమే భారత్‌ సహా ఆసియా దేశాల్లో తక్కువ సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నాయని ఢిల్లీ, మంగళూరుకు చెందిన వైద్య పరిశోధకులు వివరణ ఇచ్చారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి, మ్యాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మంగళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. వైరస్ ఉత్పత్తికి దోహదం చేసే వాతావరణాన్ని విశ్లేషించారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు పూర్తిగా మూసి ఉన్న ఏసీ గదుల్లో చాలా తక్కువ సమయం గడుపుతారు. ఇది ఆసియా దేశాల్లో కరోనా మరణాలు తక్కువ సంఖ్యలో నమోదుకావడానికి కారణం కావొచ్చు. ఐరోపా దేశాల్లో తొలినాళ్లలో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జనవరి, ఫిబ్రవరిలో అక్కడి వాతావరణం చల్లగా ఉండటంతో వారు ఎక్కువగా మూసిఉన్న గదులకే పరిమితమై ఉండి ఉండొచ్చు’ అని సర్‌ గంగారామ్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగం ఛైర్మన్‌ డాక్టర్‌ శ్యామ్ అగర్వాల్ అన్నారు. అయితే, భారత్‌లో ఒకే ఇంట్లో ఎక్కువమంది నివసించడం వల్ల కుటుంబాల్లో వైరస్‌ వ్యాప్తికి దోహదం చేస్తుందన్నారు. మూసివేసి, పరిమిత ప్రదేశాలలోని గాలిలో వైరస్ ఉండి, వ్యాప్తికి దారితీస్తుంది. ఇది వైరల్ లోడ్‌ను మరింత పెంచుతుంది అని పేర్కొన్నారు. మరోవైపు, తగినంత గాలి, వెలుతురు లేని, ఇరుకు గదుల్లో వైరస్‌ భారినపడ్డ వ్యక్తులతో ఉండటం వల్ల గాలి ద్వారా కోవిడ్-19 వ్యాప్తి చెందే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ జులైలో హెచ్చరించింది. మూసి ఉన్న, పూర్తిగా ఏసీ ఏర్పాట్లు ఉన్న గదులకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, అవి మరణాల సంఖ్య పెరుగుదలకు కారణమవుతున్నాయనే విషయంపై మాత్రం స్పష్టత లేదన్నారు. ‘కొన్ని ప్రదేశాలలో, వేసవి ప్రారంభమైన తర్వాత ప్రతి గంటకు కేవలం ఐదు ఎయిర్ ఎక్స్ఛేంజీలు ఉండేవి, దీని వల్ల వ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పెరిగి విద్యుత్ వినియోగానికి దారితీస్తుంది. గంటకు 12 నుంచి 15 ఎక్స్ఛేంజీలు ఉండాలి’అని పేర్కొన్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3luujO9

Comments