గతేడాది డిసెంబరు 23 కడప స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా, ఈ ఫ్యాక్టరీని భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్(ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న సంస్థలు తమ ప్రతిపాదనలను దాఖలు చేయాలని ప్రభుత్వం కోరింది. ప్రాజెక్టు ఏర్పాటుకు వివాదాలు లేని 3,500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని, ఏటా రెండు టీఎంసీల నీరు, నిరంతర విద్యుత్, నాలుగు వరుసల రోడ్లు, రైలు మార్గం ఉందని ప్రకటనలో వివరించింది. కృష్ణపట్నం, రామాయపట్నం ఓడరేవులకు సమీపంలోనే ఉక్కు కర్మాగారం ఉండటం సముద్ర రవాణాకు అనువైన ప్రాంతమని, ముడి ఇనుప ఖనిజం నిల్వలు సైతం సమీపంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)ను కోరుతూ గతంలోనే ప్రకటన ఇచ్చారు. దేశంలోని దిగ్గజాలైన టాటా, ఎస్‌ఆర్, జిందాల్, జేఎస్‌డబ్ల్యూ, వేదాంత వంటి ఏడు ప్రముఖ ఉక్కు కంపెనీలు ప్రతిపాదనలను దాఖలు చేశాయి. వాటి ఆర్థిక అంశాలను పరిశీలించిన తర్వాత భాగస్వామ్య సంస్థను పారదర్శకంగా ఎంపిక చేయాలని మరోసారి గ్లోబల్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్టు వైఎస్‌ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఎండీ షాన్‌మోహన్ తెలిపారు. ఈ స్టీల్ ఫ్యాక్టరీని రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు. దీని కోసం రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఒక ప్రత్యేక కంపెనీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంతో చర్చించిన తర్వాత ముడి ఇనుము సరఫరాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్‌ఎండీసీతో గతేడాది డిసెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుతం 4.8 మిలియన్ టన్నుల ముడి ఇనుము అవసరం కాగా.. ఎన్‌ఎండీసీ 5 మిలియన్ టన్నులు సరఫరా చేయనుంది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/38FoQ34
Comments
Post a Comment