ఐపీఎల్ 2020 సీజన్ లీగ్ దశ ఆఖరికి చేరుకున్నా ఇంకా ప్లేఆఫ్ బెర్తులపై క్లారిటీ రావడం లేదు. మరో నాలుగు రోజుల్లో లీగ్ దశ ముగిసిపోనుండగా ఇప్పటి వరకూ ముంబయి ఇండియన్స్ మాత్రమే ప్లేఆఫ్‌కి అర్హత సాధించగా.. రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించింది. మిగిలిన ఆరు జట్లలో ఏ టీమ్ ప్లేఆఫ్‌కి చేరుతుందో క్లారిటీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. సులువుగా ప్లేఆఫ్ చేరేలా కనిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవల తడబడుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా.. ఢిల్లీ జట్టు చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా.. బెంగళూరు చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయాల్ని చవిచూసింది. దాంతో.. పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న జట్లు నెమ్మదిగా పైకి ఎగబాకుతున్నాయి. బెంగళూరు టీమ్ ప్రస్తుతం 14 పాయింట్లతో ఉండగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లకిగానూ ఆ జట్టు కనీసం ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడితే..? నెట్ రన్‌రేట్ ఆధారంగా మాత్రమే ఆ జట్టు ప్లేఆఫ్ రేసులో ఉంటుంది. ఢిల్లీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయితే.. పంజాబ్ టీమ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా 14 పాయింట్లు సాధించే అవకాశం ఉండటంతో.. ఆ జట్లు భారీ తేడాతో విజయాల్ని అందుకోగలిగితే..? మెరుగైన రన్‌రేట్‌తో సులువుగా టాప్-4లోకి దూసుకెళ్లే అవకాశాలూ లేకపోలేదు. అబుదాబిలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌ని ఓడించిన రాజస్థాన్ రాయల్స్.. ప్లేఆఫ్ రేసుని మరింత జఠిలంగా మార్చేసింది. ఈ మ్యాచ్‌లో ఒకవేళ పంజాబ్ టీమ్ గెలిచింటే.. రాజస్థాన్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించేది. శనివారం మధ్యాహ్నం దుబాయ్ వేదికగా ఢిల్లీ, ముంబయి టీమ్స్ తలపడనుండగా.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే ప్లేఆఫ్‌కి అర్హత సాధించనుంది. మరో మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్ టీమ్స్ షార్జాలో ఢీకొట్టనుండగా.. రెండింటికీ చావోరేవో పోరు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే ప్లేఆఫ్ రేసులో ముందుకు వెళ్లడమే కాదు టాప్-4లోనూ చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. దానికి కారణం నెట్ రన్‌రేట్ +0.396గా ఉండటమే. హైదరాబాద్‌కి ఉన్న మెరుగైన రన్‌రేట్ ముంబయి మినహా మరే జట్టుకీ లేకపోవడం గమనార్హం.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3mEzPhe
Comments
Post a Comment