సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల వేధింపులు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్‌లు పెట్టినవారిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ కోసం పౌరులను దేశంలోని ఒక మూల నుంచి మరొక మూలకు తీసుకెళ్లలేమని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలోని ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) నొక్కిచెబుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఈ లక్ష్మణ రేఖను ఎవరూ అతిక్రమించరాదు.. భారత్ స్వేచ్ఛాయుత దేశం.. దానిని రక్షించడానికి సుప్రీంకోర్టుగా మేము ఇక్కడ ఉన్నాం.. రాజ్యాంగం రూపొందించడానికి కారణం సాధారణ పౌరులను ప్రభుత్వాల వేధింపులకు గురికాకుండా చూసుకోవడమే’అని ధర్మాసనం పేర్కొంది. లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయకపోవడంతో పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వంపై ఢిల్లీకి చెందిన యువతి రోషిణి బిస్వాస్ (29) విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఆ రాష్ట్ర పోలీసులకు ఆమె సమన్లు జారీచేశారు. దీంతో ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. బుధవారం దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కోల్‌కతాలోని రాజా బజార్ ప్రాంతంలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంపై రోషిణి తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ఇది లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమేనని, ప్రభుత్వం తీరుపై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ కేసు విచారణ సందర్బంగా.. బెంగాల్ ప్రభుత్వం తరఫున ఆర్ బసంత్ వాదనలు వినిపిస్తూ ఆమెను కేవలం ప్రశ్నించామని, అరెస్ట్ చేయలేదని వివరణ ఇచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఇది స్వేచ్ఛా హక్కును హరిస్తోంది.. మహమ్మారిని సరిగ్గా పరిష్కరించలేదని చెప్పినందుకు ఒకరిని విచారించలేమని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతో ఆమె తప్పనిసరిగా హాజరుకావాలని పోలీసులు నోటీసు పంపారని ప్రభుత్వ తరఫున లాయర్ వాదించారు. ‘ఇది ఒక పౌరుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా రాయడానికి ఎంత ధైర్యం అని చెప్పడం లాంటిది.. దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఆమెను విచారిస్తాం’ అని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ఆమెను పిలవడం పూర్తిగా వేధించడమే... కోల్‌కతా, ముంబై, మణిపూర్, చెన్నై పోలీసులు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను విచారణ పేరుతో పిలిపించడం ఎంతవరకు సమంజసం.. వాక్ స్వేచ్ఛ కావాలి, ఒక పాఠం నేర్పుతాం’అని పేర్కొంది. దీంతో కోల్‌కతా నుంచి దర్యాప్తు అధికారి ఢిల్లీకి వెళతారని బెంగాల్ లాయర్ తెలపగా.. ధర్మాసనం దీనికి అంగీకరించింది. దర్యాప్తునకు సహకరించాలని యువతిని కోరింది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/31RiObn

Comments