వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నకిలీ విత్తనాలతో మోసపోయారు. తన పొలంలో నాటిన విత్తనాలు నకిలీవని తేలడంతో ఆయన అవాక్కయ్యారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యవసాయంపై మక్కువ. ప్రజా ప్రతినిధి అయినా తన మూలాలు మర్చిపోలేదు.. ఇప్పటికీ తన పొలంలో వ్యవసాయం చేస్తుంటారు. ఈసారి కూడా తనకున్న పొలంలో వరి పంట వేశారు. నాట్లు వేయడం పూర్తికాగా.. ఆదివారం పొలం వెళ్లి పంటను చూసి అవాక్కయ్యారు. పొలంలో 20 శాతం నారు సరిగా పెరగకపోవడంతో నకిలీ విత్తనాలని ఆర్కే గుర్తించారు. ‘ఈరోజు చేనికి వెళ్ళాను.. ఏపీ సీడ్స్ వద్ద కొన్న వరి వంగడాలలో కేళీలు (బెరుకు విత్తనాలు) 20 శాతం ఉన్నట్లు గుర్తించా’అని ఎమ్మెల్యే తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. సదరు విత్తనాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ సీడ్స్ నుంచి కొనుగోలు చేయడంతో గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు.. అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పంటను పరిశీలించారు. ఏపీ సీడ్స్ వారికి కర్నూలు జిల్లా నంద్యాల మంజీరా సీడ్స్ కంపెనీ చెందినవారు సరఫరా చేశారని.. ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాను అన్నారు. అలాగే ఏపీ సీడ్స్ దగ్గర కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి బిల్లును కూడా బయటపెట్టారు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే నకిలీ విత్తనాలతో మోసపోవడం కలకలంరేపింది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3oxQ3Ku
Comments
Post a Comment