కర్నూలు: లాక్‌డౌన్ విధించినా వెనక్కి తగ్గలేదు.. కర్రల సమరంతో రక్తపాతం

లాక్‌డౌన్, 144 సెక్షన్ విధించినా జనాలు మాత్రం వెనక్కు తగ్గలేదు.. ఎన్ని నిబంధనలు పెట్టినా దేవరగట్టులో కర్రల సమరం కొనసాగింది. పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోని స్థానికులు లక్ష వరకు బన్నీ ఉత్సవానికి హాజరయ్యారు.. నెరినికి, సుళువాయి విరుపాపురం, అరికేరి, ఎల్లార్తి గ్రామాలవారు మాల మల్లేశ్వరస్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఈ కర్రల సమరంలో 27మందికి గాయాలుకాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రద్దు అవుతుందని అధికారులు తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేయలేదు. దీంతో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి ఏడాది దసరా పర్వదినం ముగిసిన మరుసటి రోజు దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ఉత్సవ విగ్రహాన్ని సొంతం చేసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న 34 గ్రామాలు పోటీ పడుతుంటాయి.. దివిటీలు, కర్రలతో యుద్ధం చేసుకుంటారు. ఈ ఉత్సవంలో ఎంతోమంది తలలు పగులుతాయి.. జనాలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రక్తం ఏరులై పారుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవం కొనసాగుతూ వస్తోంది. కానీ దేవరగట్టులో ఈ ఏడాది కరోనా కారణంగా ఉత్సవాన్ని రద్దు చేశారు.. రెండు రోజులపాటు లాక్ డౌన్ విధించారు. 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్టు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.. దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఊరిలో వెయ్యి మంది పోలీసుల్ని మోహరించారు.. అడుగడుగునా చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. బయట గ్రామాల నుంచి ఎవర్ని దేవరగట్టులోకి అనుమతించడం లేదు. ప్రతి ఏటా దసరా పండుగకు నిర్వహించే కర్రల సమరం బన్నీ ఉత్సవానికి బ్రేకులు వేయడానికి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్సవానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. కానీ జనాలు మాత్రం లెక్క చేయలేదు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3jwU3r9

Comments