పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి సహా 18 మందిని ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. వీరిలో భారత్, పాకిస్థాన్‌కు చెందిన పలువురు పేర్లు ఉన్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుదీన్, రియాజ్ భత్కల్ సోదరులు, దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు చోటా షకీల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. దీంతో నిషేధిత జాబితాలో చేరిన వ్యక్తుల సంఖ్య 31కు పెరిగింది. భారత్, అమెరికా విదేశీ వ్యవహారాలు, రక్షణ మంత్రుల మధ్య చర్చలు జరిగిన రోజునే కేంద్ర హోంశాఖ ఈ ప్రకటన చేయడం విశేషం. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని నిబంధనల ఆధారంగా ఈ చర్యను భారత్ చేపట్టింది. జైషే చీఫ్ మసూద్ అజార్‌ను విడిపించడానికి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని 1999లో హైజాక్ చేసిన ఉగ్రవాదులు అబ్దుల్ రవూఫ్ అస్గర్, ఇబ్రహీం అక్తర్, యూసఫ్ అజార్, పుల్వామా, 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి అబ్దుల్ రౌఫ్ అస్గర్ ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. లష్కరే తొయిబా కమాండర్, ముంబయి దాడుల కుట్రదారు సాజిద్ మీర్, మరో కమాండర్ యూసఫ్ ముజామిల్, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ బంధువు అబ్దుర్ రెహ్మాన్ మక్కీలను తాజా జాబితాలో చేర్చింది. ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, పూణె, బెంగళూరు, ముంబయి సహా పలుచోట్ల దాడులకు తెగబడ్డ రియాజ్ భత్కల్, అతడు సోదరుడు ఇక్బాల్ భత్కల్‌లనూ ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. దావూద్ సన్నిహితులు చోటా షకీల్, మహ్మద్ అనీస్ షేక్, టైగర్ మెమన్, జావెద్ చిక్నా కూడా తాజా జాబితాలో ఉన్నారు. 2002లో అక్షర్‌ధామ్‌పై దాడి, 2005లో హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న పాకిస్థాన్ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్, లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్) డిప్యూటీ చీఫ్, పాక్‌కు చెందిన షాహిద్ మెహ్‌మూద్‌నూ ఉగ్రవాదిగా ప్రకటించారు. భారత్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కార్యకలాపాల కోసం నిధులు సేకరించే సయ్యద్ సలాహుదీన్ సహాయకుడు గులాం నబీ ఖాన్, పాకిస్థాన్‌కు చెందిన జైషే కమాండర్ షాహిద్ లతీఫ్, హిజ్బుల్ ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించే పాక్ ఉగ్రవాది జాఫర్ హుస్సేన్ భట్‌లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/35AeZsk
Comments
Post a Comment