టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా శోభారాజు

ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా డాక్టర్ శోభరాజును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శోభరాజు రెండు ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. శ్రీవారి దయతోనే తనకు టీటీడీలో ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా అవకాశం దక్కిందన్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్నమాచార్య ప్రాజెక్టు సలహాదారుగా కూడా పనిచేశారు. వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి శోభరాజు ఎంతో కృషి చేశారు. అన్నమాచార్య భావనా వాహిని అనే సంస్థను నెలకొల్పి వేలాది మందికి సంగీత శిక్షణ ఇచ్చారు. శ్రీ అన్నమాచార్య భావనా వాహని ద్వారా సంగీత శిక్షణ, సంగీత ఉత్సవాలు, అన్నమయ్య కీర్తనలపై పరిశోధన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శోభరాజు స్వయంగా భక్తి గీతాలను రచించి.. వాటికి స్వర కల్పన కూడా చేశారు. ఆమె సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను 2010లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి 2013లో ఉగాది పురస్కారం స్వీకరించారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2ENPP01

Comments