ఉక్రెయిన్: కుప్పకూలిన విమానం.. శిక్షణలో ఉన్న సైనికుల సహా 22 మంది దుర్మరణం

ఉక్రెయిన్‌లో శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన సైనిక విమానం తూర్పు ప్రాంతంలోని ఖర్కీవ్ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో శిక్షణ పొందుతున్న సైనికులు సహా 22 మంది మృతిచెందినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి అంటన్ గెరాష్చెంకా తెలిపారు. ప్రమాద సమయానికి విమానంలో మొత్తం 28 మంది ఉన్నట్టు తెలిపారు. మరో ఇద్దరు గాయపడగా.. ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందది. వీరిలో 21 మంది శిక్షణ పొందుతున్న సైనికులు కాగా.. ఏడుగురు క్రూ సిబ్బంది. విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇప్పుడు చెప్పలేమని, ఇది తనను షాక్‌కు గురిచేసిందని ప్రమాదంపై మంత్రి గెరాష్చెంక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమియర్ జెలెన్‌స్కీ ప్రమాదంపై ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు తక్షణమే కమిషన్ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. విమానం కూలిపోవడానికి గల కారణాలు కమిటీ దర్యాప్తులో వెల్లడవుతాయని అన్నారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో అధ్యక్షుడు శనివారం పర్యటనించనున్నారు. ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన అంటోనోవ్-26 రవాణా విమానం స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.50 గంటలకు కూలిపోయింది. చుహుయివ్ వైమానిక స్థావరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోయిన వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం రష్యా అనుకూల వేర్పాటువాదులుండే ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలోనే జరగడం వారిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3cvCqpI

Comments