ఈ ఏడాది శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అధికమాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించే సంప్రదాయం తిరుమలలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 19 నుంచి 27 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే, కోవిడ్ కారణంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్‌లో నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో స్థానిక భక్తులను భాగస్వాములను చేస్తూ దాతల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అలాగే టీటీడీ ఆదాయం పెంచుకునే ఆలోచనలో భాగంగా ఇకపై నగదు, బంగారు డిపాజిట్లలో ప్రతి నెల కొంత మొత్తానికి గడువు తీరేలా బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు తక్కువ వడ్డీ ఇస్తున్నందు టీటీడీ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ వచ్చేలా ఆర్‌బీఐ, ఇతర బ్యాంకులతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. శనివారం నుంచి తిరుపతిలో 3 వేల ఉచిత శ్రీవారి దర్శన టోకెన్లు జారీచేయనున్నారు. విశాఖ దివ్య క్షేత్రం ఘాట్ రహదారి వాలు గోడల నిర్మాణానికి రూ.4.95 కోట్ల మంజూరుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక సీఎం చేతుల మీదుగా ఈ ఆలయానికి మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/32DqopA
Comments
Post a Comment