తెలుగు రాష్ట్రాల్లో ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలోని గ్యాస్ లీకేజ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి జిల్లాలోని చిన్న శంకరం పేట మండలం మీర్జాపల్లి గ్రామంలో ఒక్కసారిగా దుర్వాసన వ్యాపించింది. చాలామందికి కళ్లు మంటలు పుట్టాయి. ఊరంతా పొగతో నిండిపోయింది. ఏం జరుగుతుందో అర్థంకాక చాలామంది హాహాకారాలు చేశారు. ఇటీవలే విశాఖలో గ్యాస్ కారణంగా దుర్ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఊరంతా కలకలం చెలరేగింది. చివరకు ఆ పొగ గ్రామ శివార్లలోని కార్తికేయ ఫార్మా సంస్థ నుంచి వస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే స్థానికులంతా పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళన చేసి అక్కడి పనులు నిలిపివేయించారు. ఫార్మా సంస్థను 2014లో స్థాపించారు. బుధవారం అర్దరాత్రి అమ్మోనియం సల్ఫేట్ తయారు చేస్తుండగా.. వేడి తీవ్రతకు రియాక్టర్ పైపు నుంచి విషవాయువు లీకైనట్లు తెలుస్తోంది. ఆ వాయువుతో సుమారు 25 మంది వరకు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే గ్యాస్ లీకేజీ తగ్గిన తర్వాతే దుర్వాసన, కళ్లమంట తగ్గినట్లు గ్రామస్థులు తెలిపారు. Read More: ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పరిశ్రమలోని రియాక్టర్లను గురువారం పరిశీలించారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు వచ్చి విచారణ జరిపి నివేదిక ఇచ్చే వరకు కంపెనీ పనులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం పీసీబీ అధికారులు పరిశ్రమ వద్ద పలు శాంపిళ్లు సేకరించారు. మరోవైపు.. సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే గ్యాస్ లీకయిందని స్థానికులు మండిపడ్డారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/31ATjeJ
Comments
Post a Comment