యూఏఈలోని జట్టులో కరోనా వైరస్ కేసులు ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు టోర్నీలోని మిగిలిన ఫ్రాంఛైజీలని కూడా ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆగస్టు 21న అక్కడికి చేరుకున్న చెన్నై టీమ్.. ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉండగా.. ఆ క్వారంటైన్ గడువు ముగిసేలోపు ఏకంగా 13 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇందులో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నారు. దాంతో.. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమవుతుందా..? అనే సందేహాలు నెలకొన్నాయి. అనూహ్యంగా.. యూఏఈలోని మిగిలిన ఏడు జట్లలో కనీసం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. చెన్నై టీమ్‌లో 13 కరోనా కేసులు నమోదవడంతో అక్కడి పరిస్థితిపై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో తాను మాట్లాడినట్లు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ తాజాగా వెల్లడించాడు. ‘‘ధోనీతో నేను మాట్లాడాను. ఒకవేళ టీమ్‌లో కరోనా కేసులు ఇంకా పెరిగినా..? కంగారుపడాల్సింది ఏమీ లేదని ధోనీ నాకు భరోసా ఇచ్చాడు. ఇప్పటికే టీమ్‌లోని ఆటగాళ్లతో జూమ్‌లో మాట్లాడి భద్రంగా ఉండాలని సూచించినట్లు ధోనీ నాకు చెప్పాడు. సమస్య ఏదైనా..? ధోనీ అస్సలు కంగారుపడడు. అంతేకాదు.. జట్టులోని మిగిలిన ఆటగాళ్లలోనూ అతను ఆత్మవిశ్వాసాన్ని నింపగలడు. ధోనీ సాలిడ్ కెప్టెన్’’ అని శ్రీనివాసన్ ధీమా వ్యక్తం చేశాడు. కరోనా వైరస్ బారినపడిన దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు 11 మంది టీమ్ స్టాఫ్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటుండగా.. సెప్టెంబరు 19న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2019 ఐపీఎల్ సీజన్ రన్నరప్‌గా ఉన్న చెన్నై టీమ్.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఢీకొట్టాల్సి ఉంది. దాంతో.. ఐపీఎల్ షెడ్యూల్‌లోనూ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2EO4jN6
Comments
Post a Comment