కరోనా పుట్టిల్లు వుహాన్‌లో తెరుచుకోనున్న స్కూల్స్.. మంగళవారం నుంచే ప్రారంభం

కరోనా మహమ్మారి పురుడుపోసుకున్న చైనాలోని నగరంలో ప్రస్తుతం పాజిటివ్ కేసులు జీరోకి చేరుకున్నాయి. వుహాన్‌‌ను కోవిడ్-19 ఫ్రీ నగరంగా అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వుహాన్‌లో మంగళవారం నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. నగరంలోని కిండర్‌గార్డెన్స్‌ సహా అన్ని పాఠశాలలు ప్రారంభంకానున్నాయని అక్కడి అధికారులు శుక్రవారం వెల్లడించారు. వుహాన్‌లోని మొత్తం 2,842 విద్యాసంస్థలు పునఃప్రారంభం కానుండగా.. దాదాపు 14లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. అలాగే వుహాన్‌ యూనివర్సిటీ సోమవారం నుంచే కార్యకలాపాలను ప్రారంభించనుంది. విద్యార్థులు మాస్కులు ధరించాలని, సాధ్యమైనంత వరకు ప్రజారవాణాను ఆశ్రయించవద్దని అధికారులు సూచించారు. పాఠశాలల వద్ద తప్పకుండా వ్యాధి నియంత్రణ పరికరాలు సిద్ధంగా ఉంచాలని తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. కొత్త మహమ్మారులు దాడి చేసినా..వాటిని ఎదుర్కొనేలా విద్యార్థులకు వ్యాయామాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అవసరం లేకుండా ఒకేచోట గుంపులుగా చేరవద్దని, పాఠశాలలు ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందికి నివేదికలు అందజేయాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల నుంచి సమాచారం అందని విదేశీ విద్యార్థులు, ఉపాధ్యాయులు రావడానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉండగా..ఒకవేళ పరిస్థితి చేయిదాటితే తిరిగి ఆన్‌లైన్‌ తరగతులకు మారేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గతేడాది డిసెంబరు చివరిలో మొదలైన కరోనా వైరస్‌ ధాటికి వుహాన్‌ నగరం చిగురుటాకులా వణికిపోయింది. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు చైనా ప్రభుత్వం జనవరి చివరి నుంచి 75 రోజులకు పైగా ఆ నగరంలో లాక్‌డౌన్ విధించింది. చైనాలో మొత్తం కరోనా మరణాల్లో 80 శాతం వుహాన్‌లోనే నమోదయ్యాయి. చైనాలో మొత్తం కరోనా మరణాలు 4,634 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క వుహాన్‌లో 3,869 మంది చనిపోయారు. లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలుచేయడంతో వుహాన్ నగరంలో ఏప్రిల్ నాటికి పరిస్థితులు కుదుటపడ్డాయి. దీంతో ఏప్రిల్ 8 నుంచి ఆంక్షలను సడలించారు. మే 18 నుంచి స్థానికంగా కొత్త కేసులు అక్కడ నమోదుకాలేదు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3gGw07J

Comments