దేశంలో కరోనా కరాళనృత్యం: నిన్న ఒక్క రోజే 80వేల కేసులు.. ఇదో ప్రపంచ రికార్డు

దేశంలో కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది. ఆదివారం ఏకంగా 80వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో, ఒక్క రోజే 80వేల కేసులు నమోదయిన తొలి దేశంగా భారత్ ఘనత సాధించింది. మొదలైన తర్వాత ఈ దేశంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో కేసులు ఇప్పటి వరకూ నమోదుకాకపోవడం గమనార్హం. కొత్త కేసులు, మరణాలు రెండింటిలో వృద్ధి రేటు తగ్గినా ముందు వారంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆదివారం 80వేలకుపైగా కేసులు నమోదుకాగా.. వారాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఆగస్టు 9న ఆదివారం 63,851 కేసులే ఇప్పటి వరకూ అత్యధికం. ఏదేమైనా, తాజా కేసులు కొత్త రికార్డు కంటే భయంకరమైంది ఏంటంటే, ఆగస్టులో అంతకు ముందు వారాలలో మహమ్మారి వృద్ధి రేటు తగ్గి, నెల చివరి వారంలో పెరగడం. గడచిన ఐదు రోజులుగా రోజుకు 76వేల కొత్త కేసులు నమోదుకాగా.. అంతకు ముందు వారంతో పోల్చితే వృద్ధి రేటు 13.1 శాతంగా ఉంది. ముందువారం ఇది 4.7 శాతంగా నమోదయ్యింది. దీనికి ముందు ఆగస్టు 9-15 మధ్య 5.9 శాతం, ఆగస్టు 3-9 మధ్య 10.9 శాతంగా ఉంది. ఇదే సమయంలో మరణాలు రేటు కూడా పెరిగింది. వరుసగా నాలుగు రోజులు 1,000కిపైగా మరణాలు చోటుచేసుకోగా.. గతవారంతో పోల్చితే ఇది 3.9 శాతం అధికం. దేశవ్యాప్తంగా ఆదివారం నమోదయిన కేసుల్లో మహారాష్ట్ర టాప్‌లోనే ఉంది. అక్కడ వరుసగా రెండో రోజు 16వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 16,408 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. అలాగే యూపీలో తొలిసారి పాజిటివ్ కేసులు 6వేలు దాటాయి. రాజస్థాన్ (1,450), మధ్యప్రదేశ్ (1,558), చత్తీస్‌గఢ్ (1,471), జమ్మూ కశ్మీర్ (786)లో రికార్డుస్థాయిలో రోజువారీ కేసులు బయటపడ్డాయి. దేశంలో ఆదివారం మరో 970 మరణాలు చోటుచేసుకోగా.. మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 65వేలకు చేరవయ్యింది. మహారాష్ట్రలో మరో 296 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ కరోనా మృతుల సంఖ్య 24,399కి చేరింది. దేశంలోని మొత్తం కరోనా మరణాల్లో 38 శాతం అక్కడే చోటుచేసుకున్నాయి. భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 36 లక్షలు దాటాయి. ఇందులో 27.67 లక్షల మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు దాదాపు 8 లక్షలు ఉన్నాయి. ఏపీలో మరో 10,603 మందికి వైరస్ సోకగా.. దేశంలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటి వరకూ తమిళనాడు ఆ స్థానంలో ఉండగా.. ఆదివారం దానిని అధిగమించింది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/32IXlkR

Comments