ప్లేయర్స్‌ని హ్యాండిల్ చేయడంలో KKR బెస్ట్: దినేశ్ కార్తీక్

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) టీమ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ జట్టు కో-ఓనర్ షారూక్ ఖాన్ కారణంగా తొలుత క్రేజ్ సంపాదించుకున్న కేకేఆర్.. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచి ఆ ఆదరణని మరింత పెంచుకుంది. అయితే.. గంభీర్ తర్వాత కేకేఆర్ టీమ్ పగ్గాలు అందుకున్న గత రెండేళ్లుగా అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ.. టోర్నీలో మంచి క్రేజ్‌ ఉన్న టాప్-3 టీమ్స్‌లో ఒకటిగా కోల్‌కతా కొనసాగుతోంది. దానికి కారణం కేకేఆర్ ఫ్రాంఛైజీ ఆటగాళ్లని బాగా హ్యాండిల్ చేయగలగడమేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో దినేశ్ కార్తీక్ స్పష్టం చేశాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. తొలుత ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఆడిన దినేశ్ కార్తీక్ ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ (ఇప్పుడు టోర్నీలో లేదు) టీమ్స్‌కి ఆడాడు. అయితే.. 2018 ఐపీఎల్ సీజన్ ఆటగాళ్ల వేలంలో దినేశ్ కార్తీక్‌ని రూ. 7.4 కోట్లకి కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ.. అనూహ్యంగా అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. ‘‘ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీ ఓనర్లు ఆటగాళ్లని చూసే విధానం, గెలుపోముల్ని స్వీకరించే తీరుని నేను మొదటి నుంచి గమనిస్తున్నా. ఈ క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే..? ఆటగాళ్లని హ్యాండిల్ చేయడంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బెస్ట్ అని. క్లిష్ట పరిస్థితుల్లోనూ కేకేఆర్ ఫ్రాంఛైజీ.. ఆటగాళ్లతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. కోల్‌కతా జట్టులో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నా’’ అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. వాస్తవానికి ఐపీఎల్ 2020 సీజన్‌కి దినేశ్ కార్తీక్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభమన్ గిల్‌కి ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారని వార్తలు వచ్చాయి. గత రెండు సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫెయిల్యూర్స్‌కి కారణం అతని పేలవ కెప్టెన్సీ అనే విమర్శలు వచ్చాయి. కానీ.. ఎందుకో ఆ చర్చ కనుమరుగైంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2X1Lwnv

Comments