రాయలసీమ ఎత్తిపోతలకు జగన్ సర్కార్ టెండర్లు

జగన్ సర్కార్ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. సోమవారం నుంచి టెండర్లు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జ్యుడిషియల్‌ రివ్య్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. వచ్చే నెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి 19న టెండర్‌ను ఖరారు చేయనున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా ఈ ఎత్తిపోతలకు జగన్ సర్కార్ కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే టెండర్లు పలిచింది. మరోవైపు ఈ ఎత్తిపోతలపై కమిటీ నివేదిక వచ్చే వరకూ పథకం పనులు చేపట్టొద్దని గ్రీన్ ట్రైబ్యునల్‌ చెన్నై జోనల్‌ బెంచ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ, జల్‌శక్తి, కేంద్ర జలసంఘం, కృష్ణానది యాజమాన్య బోర్డుల అనుమతులు లేకుండానే ఈ ఎత్తిపోతల నిర్మిస్తున్నారంటూ తెలంగాణలోని నారాయణపేట జిల్లా బాపన్‌పల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీని ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొద్ది మొత్తంలో నీళ్లు తీసుకుంటున్నామంటూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసేలా జల దోపిడీ చేస్తున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల లాభ..నష్టాలపై ఈ కమిటీ పరిశీలించి రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3jSHmZh

Comments