కరోనా వైరస్ ప్రభావం సామాన్యుడిపైనే కాదు సర్కారు మీద కూడా తీవ్రంగా పడింది. కోవిడ్ దెబ్బకు సర్కారు ఆదాయం గణనీయంగా తగ్గగా.. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా అప్పులు పెరిగాయి. 2019 ఏప్రిల్‌తో పోలిస్తే.. 2020 ఏప్రిల్ నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాగ్ విడుదల చేసిన రిపోర్టులో ఉన్న గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ సర్కారు రూ.9018 కోట్లు ఖర్చు పెట్టింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో ప్రభుత్వ ఖర్చు రూ. 6646 కోట్లే కావడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్‌లో ఆదాయం ఆశాజనకంగా ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మాత్రం లాక్‌డౌన్ ప్రభావంతో సర్కారు ఆదాయం గణనీయంగా తగ్గింది. 2019 ఏప్రిల్‌లో జీఎస్టీ రూపంలో దాదాపు రూ.1574 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అదే నెలలో సుమారు రూ.777 కోట్ల ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది ఏప్రిల్‌లో రూ.525.94 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏప్రిల్‌లో రూ.21.40 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. సేల్స్ ట్యాక్స్ రూపంలో 2019 ఏప్రిల్‌లో రూ.1399.81 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ ఏప్రిల్ అది రూ.193.87 కోట్లకు పడిపోయింది. ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం కూడా రూ.575.59 కోట్ల నుంచి రూ.8.09 కోట్లకు పడిపోయింది. కేంద్ర పన్నుల్లో వాటా, పన్నేతర ఆదాయం, ఇతర ఆదాయం కూడా తగ్గిపోయింది. కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కేంద్రం నుంచి ఈ ఏప్రిల్‌లో రూ.1402 కోట్లు అందాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ సర్కారు ఏప్రిల్ నెలలో రూ.5700 కోట్లు అప్పు చేసింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో సర్కారుకు వచ్చిన ఆదాయం రూ.7181.95 కోట్లు కాగా.. ఖర్చు రూ.6646 కోట్లు ఉంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.5700 కోట్ల అప్పులు, రూ.1402 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలుపుకొని రాబడి రూ.9088.23 కోట్లకు చేరింది. కానీ ఈ ఏప్రిల్ నెలలో రూ.9108.74 కోట్లు ఖర్చయ్యింది. ఇందులో కరోనా వైరస్ కారణంగా రెవెన్యూ ఖర్చులే రూ.4602 కోట్లు ఉన్నాయి. జీతాల్లో కోత వల్ల ఈ ఖర్చు గత ఏడాదితో పోలిస్తే రూ. 1896.39 కోట్ల నుంచి రూ.1580.39 కోట్లకు తగ్గింది. ఫించన్ల ఖర్చు కూడా రూ.917.73 కోట్ల నుంచి రూ.444.45 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు, సబ్సిడీల ఖర్చు భారీగా పెరిగింది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2X3u4PA
Comments
Post a Comment