రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, వారి దగ్గర పని చేసే సిబ్బంది, అధికారులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇటీవల వరంగల్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కరోనా కలకలం రేగింది. ఆ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గన్‌మెన్లతోపాటు వ్యక్తిగత సిబ్బందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కాగా వారంతా ఇప్పటికే పలు సమావేశాల్లో పాల్గొనడంతో ఆందోళన మొదలైంది. పాత వరంగల్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం హన్మకొండలోని సీఎస్ఆర్ గార్డెన్‌లో మంత్రి ఈటల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారికి వైద్యారోగ్య శాఖ అధికారులు కరోనా టెస్టులు చేయగా.. వీరిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా పాజిటివ్ అని తేలిన వారిలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి దగ్గర పని చేసే ఇద్దరు గన్‌మెన్లు, పర్సనల్ ఫొటోగ్రాఫర్, ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగే మరో వ్యక్తి ఉన్నారు. ఓ గన్‌మెన్ భార్య, కూతురికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే కరోనా సోకిన వారెవరూ మీటింగ్‌లో పాల్గొనలేదని.. టెస్టులు చేయించుకుని వెళ్లిపోయారని వరంగల్ అర్బన్ డీఎంహెచ్‌వో లలితాదేవి తెలిపారు. వాళ్లకు ఆరోజు ఉదయాన్నే టెస్టులు చేయాల్సి ఉందని.. కానీ ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొనాల్సి ఉండటంతో ఆయనకు ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో భేటీ జరిగిన గార్డెన్‌లో టెస్టులు చేశామన్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3jUxuxS
Comments
Post a Comment