రైతులకు జగన్ సర్కార్ తీపి కబురు.. కీలక నిర్ణయాలు

వ్యవసాయం, రైతులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో అన్ని వర్గాలకు 2020-21లో రూ.2,51,600 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కంటే 9.78 శాతం ఎక్కువ రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయ రంగానికి ఈ ఏడాది రూ.1.29 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో కౌలు రైతులకు రూ.6,500 కోట్లు పంటరుణంగా ఇవ్వనున్నారు. గతేడాదితో పోలిస్తే సాగుకు రుణ లక్ష్యం 11.90% పెంచారు. పాడి పరిశ్రమాభివృద్ధికి, వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేయబోతున్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకూ 10% మేర కేటాయింపులు పెరిగాయి. 2019-20 రుణ ప్రణాళిక కేటాయింపులతో పోలిస్తే.. విద్యకు 30.48%, గృహనిర్మాణానికి 9.90%, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు 12.97% చొప్పున తగ్గించారు. వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమకు రూ.6,820 కోట్లు రుణ లక్ష్యంగా ప్రతిపాదించారు. యాంత్రీకరణకు రూ.3,400 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.1,837 కోట్లు, అటవీ, బంజరుభూముల అభివృద్ధికి రూ.724 కోట్లు, కోళ్ల పరిశ్రమకు రూ.1,860 కోట్లు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకానికి రూ.1,335 కోట్లు, మత్స్యరంగానికి రూ.1,747 కోట్లు, చిన్న నీటిపారుదలకు 1,947 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు రూ.18,674 కోట్లు, చిన్న పరిశ్రమలకు రూ.14,559 కోట్లు, మధ్య తరహా పరిశ్రమలకు రూ.6,367 కోట్లు రుణాలుగా ఇవ్వనున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2P9IQQG

Comments