కొవిడ్ ఆస్పత్రిలో ప్రేమకథ ఏంటని షాకవుతున్నారా.. మీరు వింటున్నది నిజమే. ఇరు కుటుంబాల్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అసలు స్టోరీ విషయానికి వస్తే.. ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన యువకుడు.. చిలకలూరిపేటకు చెందిన యువతికి కరోనా పాజిటివ్ తేలడంతో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు.. పక్క, పక్కనే బెడ్లు.. ఇద్దరికీ వ్యాధి లక్షణాలు కూడా లేకపోవడంతో ధైర్యంగా ఆ మహమ్మారిని జయించారు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో బెడ్‌లు పక్కపక్కనే కావడంతో వీరిద్దరి మధ్య ముందు మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిసి ప్రేమగా మారింది. అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్. అమ్మాయి కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. అంతేకాదండోయ్ ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే. కరోనా నుంచి కోలుకోవడంతో మళ్లీ టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తమ ప్రేమకథను తల్లిదండ్రులకు చేరవేశారు.. తాము ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేయమని కోరారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తుండటంతో అమ్మాయి తరపు కుటుంబ పెద్దలు పెళ్లికి ఓకే చెప్పారట. ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఆలస్యం ఎందుకు అనుకున్నారేమో.. ఈ నెల 25న పొన్నూరులోని ఓ దేవాలయంలో పెద్దల సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి వారం, పదిరోజుల వ్యవధిలోనే ప్రేమకథ నడిచింది.. పెళ్లి కూడా అయ్యింది. ఈ కొవిడ్ ప్రేమకథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/304Q12N
Comments
Post a Comment