కరోనా మరణాల్లో గోప్యత లేదని ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. కరోనా మరణాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్న ఆయన.. సాధారణ మరణాలను కరోనా జాబితాలో చేర్చలేమన్నారు. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు వెయ్యి మంది చనిపోతారన్న ఈటల.. ప్రతి మరణానికి కరోనా కారణం కాదన్నారు. మంగళవారం పాత వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి.. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కరోనాపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. అమెరికా లాంటి పరిస్థితులు ఇక్కడ లేవన్నారు. రాష్ట్రంలో 81 శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదన్న మంత్రి.. ర్యాపిడ్ టెస్టుతో అరగంటలోనే ఫలితం వస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు ఉన్నాయన్న ఈటల.. ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్లి డబ్బులు వృథా చేయొద్దన్నారు. కరోనా భయం వల్ల కన్న పిల్లలు సైతం తల్లిదండ్రుల మృతదేహాలను తీసుకెళ్లడానికి ముందుకు రావడం లేదని ఈటల తెలిపారు. అలాంటి మృతదేహాలతోపాటు గుర్తు తెలియని శవాలకు జీహెచ్ఎంసీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారన్నారు. ఇతర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ఇటీవలి కాలంలో మరణించిన అనంతరం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతోంది. ఇలాంటి మరణాలను కూడా కరోనా మృతుల జాబితాలో కలపాల్సిన అవసరం లేదని తెలంగాణ సర్కారు చెబుతోంది. కానీ ఇలా చనిపోయిన వారి వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. డెడ్ బాడీలకు కరోనా టెస్టులు చేసి కోవిడ్ మరణాల జాబితాలో చేర్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2DgGEnu
Comments
Post a Comment