కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో ఆక్సిజన్ కొరత...!

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆక్సిజన్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కేసులు ఇదే రీతిలో పెరిగితే డిమాండ్‌ పెరిగిపోయి కొరత తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎలెన్‌బరీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ లిమిటెడ్, ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. కాగా డిమాండ్ మాత్రం 120 నుంచి 140 టన్నుల వరకు ఉంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ముందుగా మెడికల్ ఆక్సిజన్‌ను డిమాండ్‌కు సరిపడా సరఫరా చేసి.. తర్వాత ఇండస్ట్రియల్ ఆక్సిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. గతంలో కంటే 15-20 రెట్లు ఎక్కువగా మెడికల్ ఆక్సిజన్ కావాలని హాస్పిటళ్లు కోరుతున్నాయి. డిమాండ్ పెరగడంతో ఆక్సిజన్ సిలిండర్ల ధర కూడా పెరుగుతోంది. అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లను ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వారిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఆక్సిజన్ కొరత తీవ్రంగా లేదని డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ వై. నవీన్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో కరోనా కేసులు వేగంగా పెరిగితే ఆక్సిజన్ సిలిండర్ల అవసరం మరింత పెరిగి క్లిష్ట పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తోన్న నేపథ్యంలో ఆకస్మిక దాడులు చేపడుతున్నామని తెలిపారు. ఆక్సిజన్ కొరతను అధిగమించడం కోసం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని స్టీల్ ప్లాంట్ల నుంచి ఎక్కువ సరఫరా చేసుకోవడంపై సర్కారు శ్రద్ధ పెట్టాలని ఓ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. గతంలో జిందాల్ స్టీల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసేదన్నారు. ఆక్సిజన్ సిలిండ్లర ధరపై నియంత్రణకు ప్రస్తుతం ఎలాంటి చట్టం లేదు. ఇది వరకు క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ ధర రూ.10కి లభించగా.. ప్రస్తుతం పెరిగిన డిమాండ్ కారణంగా రూ.18-20కి చేరిందని సప్లయర్ ఒకరు తెలిపారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2EFD2fF

Comments