పీఠాధిపతి కాబోయి.. అనూహ్యంగా ప్రధాని పీఠమెక్కిన పీవీ

పీవీ నర్సింహారావు... ప్రజ్ఞ‌ాశాలి, బహుభాషా కోవిదుడు, అపర చాణుక్యుడు, రాజనీతిజ్ఞుడు... తెలుగు నిఘంటవులోని పదాలన్నీ ప్రోదిచేసి చెప్పినా ఆయన గురించి తక్కువే అవుతుంది. దేశం ఆర్ధిక పతనం అంచుకు చేరి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా పగ్గాలు చేపట్టి మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటూ పూర్తిగా నడపడం ఆయనకే చెల్లింది. అంతేకాదు, కుంటుపడిపోయిన ఆర్ధిక ప్రగతి చక్రాన్ని పట్టాలెక్కించి ప్రపంచ దేశాలతో ఔరా అనిపించుకున్నారు. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించి, ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయి పడగల నవలను హిందీలోకి సహ్రస్ ఫణి పేరుతో అనువదించిన బహుభాషా కోవిదుడు పీవీ. అయితే, ఆయన జీవితంలో చాలా మందికి తెలియని మరో పార్శ్వం కూడా ఉంది. రాజకీయ, సామాజిక విషయాలే కాదు, ఆధ్యాత్మికంగానూ ఉన్నత స్థితికి చేరారు. దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ నుంచి రాజకీయ ప్రోత్సాహం నిలిచిపోవడం, 1990లో అమెరికాలో గుండెకు ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చారు. అక్కడ నుంచి రాగానే తమిళనాడులో కుర్తాళంలోని సిద్ధేశ్వర పీఠం నుంచి పీవీకి సందేశం వచ్చింది. అద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యుల సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధేశ్వర పీఠం నెలకొల్పారు. ఆ ఆశ్రమాన్ని పీవీ తరచూ సందర్శిస్తూ సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అప్పటి పీఠాధిపతి మౌనస్వామి శివైక్యం పొందాక ఆయన వారసుడి కోసం ఆశ్రమం అన్వేషించింది. పీఠాధిపతిగా పీవీయే తగిన వ్యక్తిగా భావించి సందేశం పంపింది. అయితే, ఆ ఆహ్వానాన్ని పీవీ వెంటనే అంగీకరించలేదు.. అలాగని తిరస్కరించనూ లేదు. ఇది జరిగిన కొద్ది నెలల తర్వాత 1991 సార్వత్రిక ఎన్నికల్లో పీవీకి టికెట్‌ ఇవ్వకూడదని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఆయనకు పార్టీ మేనిఫెస్టో బాధ్యతలు అప్పగించడంతో తన రాజకీయ ప్రస్థానం ముగించాల్సిన సమయం వచ్చిందని ఈ కర్మ యోగి భావించారు. కుర్తాళం పీఠం బాధ్యతలు స్వీకరించడానికి దాదాపుగా సిద్ధమయ్యారు. దీంతో 1990లో పీఠం ప్రతినిధులు పంపిన ఆహ్వానాన్ని అంగీకరించే దిశగా ఆలోచిస్తున్నట్లు ఆయన సందేశం పంపారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరగవు. తానొకటి తలిస్తే దేవుడొకటి తలిచాడు అంటారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1991 మే 21 తమిళనాడులోని పెరంబుదూర్‌‌లో జరిగిన సభలో పాల్గొన్న రాజీవ్‌గాంధీ అక్కడే హత్యకు గురయ్యారు. రాజీవ్ స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టడానికి సోనియా గాంధీ నిరాకరించారు. దీంతో కాంగ్రెస్‌లో ఎంతో మంది ఉద్ధండులు పోటీ పడినా సొంత వర్గమంటూ లేని పీవీకి పగ్గాలు అప్పచెప్పడానికి సోనియా మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరించినా సాధారణ మెజారిటీకి దూరంగానే ఉంది. ప్రధాని పదవికీ పలువురు నేతలు పోటీ పడినా చివరికి సోనియా పీవీవైపే మొగ్గు చూపారు. ఆయన సారథ్యంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత అంతా చరిత్రే సృష్టించారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2CKRMc5

Comments