దేశవ్యాప్తంగా కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రోజురోజుకు భారీగా పెరుగుతున్న కేసులతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కఠినంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన వారు సైతం వాటిని పక్కన పెడుతున్నారు. ఇలా ఓ పెళ్లిలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా సోకడానికి కారణమైన ఓ కుటుంబానికి అధికారులు భారీ జరిమానా విధించారు. వరుడు కుటుంబానికి ఏకంగా 6 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాకు చెందిన గీసులాల్ రాఠీ ఈ నెల 13న తన కుమారుడికి వివాహం జరిపించాడు. కరోనా కారణంగా పెళ్లికి 50 మంది అతిథులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతులు విధించిన విషయం తెలిసిందే. అయితే నిబంధనలు పక్కనపెట్టి గీసులాల్ ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించాడు. వివాహానికి హాజరైన వారిలో 15 మందికి మహమ్మారి సోకినట్లుగా తేలింది. కరోనా సోకిన వీరిలో ఒకరు చనిపోయారు కూడా. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఈ నెల 22న గీసులాల్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు, కరోనా సోకిన వారిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు. వీరికి కరోనా పరీక్షల నిర్వహణ, చికిత్స, ఆహారం, అంబులెన్స్ తదితర వాటికి మొత్తంగా రూ.6,26,600 అయింది. దీంతో ఈ మొత్తాన్ని గీసులాల్ కుటుంబం నుంచి వసూలు చేయాలని నిర్ణయించిన కలెక్టర్ రాజేంద్ర భట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మొత్తాన్ని వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిలో డిపాజిట్ చేయాలని సూచించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2ZksjOg
Comments
Post a Comment