ఉత్తరప్రదేశ్, బిహార్‌లో బుధవారం కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లోని 31 జిల్లాల్లో కురిసిన పిడుగుల వాన తీవ్ర ప్రాణ నష్టం కలిగించింది. మొత్తం 110 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా బీహార్‌లో 83 మంది, ఉత్తరప్రదేశ్‌లో 27 మంది పిడుగులకు బలయ్యారు. బీహార్‌లోని 23 జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి 83 మంది ప్రాణాలు కోల్పోయారు. గోపాల్ గంజ్ జిల్లాలో అత్యధికంగా 13, నవాడాలో 8మంది, సివాన్, భాగల్పూర్‌లలో చెరో ఆరుగురు, దర్భాంగ, బంకాలో ఐదుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. అలాగే, నవాడా, ఖగారియా, ఔరంగాబాద్, పశ్చిమ చంపారన్, కిషన్‌గంజ్, సమస్థీపూర్, జహనాబాద్, బక్సార్, కైమూర్, జముయీ, పూర్ణియా, సుపాల్, షేహోర్, సరాన్, సితామర్హి, మధేపురలోనూ పులువురు మృతిచెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో చేర్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో అత్యధికంగా తొమ్మిది మంది, ప్రయాగ్‌రాజ్‌లో ఆరుగురు, అంబేడ్కర్‌నగర్ ముగ్గురు, బారాబంకీ ఇద్దరు చొప్పున చనిపోయారు. పిడుగులకు బలైనవారిలో పొలం పనులు వెళ్లినవారే అధికంగా ఉన్నారు. యూపీలో మరో 24 మంది పిడుగులకు గాయపడినట్టు ఆ రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ ఆఫీస్ వెల్లడించింది. పిడుగుల వల్ల చనిపోయినవారి బాధితుల కుటుంబాలకు బీహార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. వచ్చే రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు, వర్షాల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బయటకు వెళ్లినవాళ్లు చెట్లకింద నిలబడవద్దని సూచిస్తున్నారు. భారత వాతావరణ శాఖ కూడా బిహార్‌లోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 72 గంటల పాటు యూపీ, బిహార్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలోకి ఇంకా రుతు పవనాలు ప్రవేశించడానికి ముందే వర్షాలు కురుస్తున్నాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3g00mly
Comments
Post a Comment