నిప్పుల కొలిమిలా దేశం.. ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతంగా భారత్ రికార్డ్!

అంపన్ తుఫాను తీరం దాటిన తర్వాత దేశంలో అమాంతం ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. గడచిన వారం రోజులుగా వాయువ్యం నుంచి వీస్తున్న వేడి గాలులతో ఉత్తరాది ఉడుకుతోంది. ఢిల్లీలో 18 ఏళ్ల తర్వాత మే నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన రోజుగా మంగళవారం రికార్డుల్లో నిలిచింది. అంతేకాదు, మంగళవారం నమోదయిన ఉష్ణోగ్రతలతో ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతంగా ఉత్తర భారత దేశంలో రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచ ఉష్ణోగ్రతల వివరాలను తెలియజేసే ఈఎల్ దోరాడో వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని చురు, పాకిస్థాన్‌లోని జకోబాబాద్‌లో అత్యధికంగా 50 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మంగళవారం ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రాంతంలో నమోదయిన ఉష్ణోగ్రతల్లో ఇవే అత్యధికం. దేశ రాజధాని ఢిల్లీలోని సఫ్దర్జంగ్‌లో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మే 2002లో ఇదేస్థాయిలో ఉష్ణోగ్రతలు ఢిల్లీలో నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఢిల్లీలో 1944 మే 29న నమోదయిన 47.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలే అత్యధికం. పాలంలోనూ మంగళవారం 47.6 డిగ్రీల నమోదు కాగా.. 2010 తర్వాత ఇక్కడ ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే, 1998 మే 26న నమోదయిన 48.4 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటి వరకూ అత్యధికం. మంగళవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటే నమోదుకావడం గమనార్హం. ‘అంపన్ తుఫాను తూర్పు దిశగా ప్రయాణిస్తూ తీరం దాటడం వల్ల ఉత్తరాది నుంచి తేమను తీసుకుపోయిందని, ఇదే సమయంలో రాజస్థాన్ లేదా తూర్పు పాకిస్థాన్ నుంచి వాయువ్య దిశగా బలమైన వేడిగాలులు వీస్తున్నాయని వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో వాయువ్య, మధ్య, తూర్పు భారతంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఐఎండీ బులెటిన్ ప్రకారం.. విదర్బ సహా పలు ప్రాంతాల్లో రెండు రోజులు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి.. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, సహా పంజాబ్, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మే 27న తీవ్రమైన వేడిగాలలు వీస్తాయని తెలిపింది. తూర్పు నుంచి పశ్చిమం వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల బుధ, గురువారాలు పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి.. అలాగే ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు మే 28 నుంచి తగ్గే అవకాశం ఉంది. 29 నుంచి వడగాల్పులు కూడా తగ్గుముఖం పడతాయని తెలిపింది. ప్రధానంగా బుధవారం ఉదయం పగటిపూట గంటకు 20-30 కి.మీ వేగంతో కొన్ని ప్రదేశాలలో బలమైన గాలులు వీస్తాయి. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45, 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2XqAMOU

Comments