దేశంలో మహమ్మారి మరింత ఉద్ధృతమవుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల రికార్డు స్థాయిలో నిర్ధారణ అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 158,086కి చేరింది. దేశంలో వైరస్ మొదలైన తర్వాత తొలి 70 రోజుల్లో 50 వేల కేసులు నమోదుకాగా.. ఈ సంఖ్య లక్షకు చేరడానికి మరో 39 రోజులు పట్టింది. అయితే, ప్రస్తుతం కేవలం 9 రోజుల్లో ఈ సంఖ్య లక్షన్నర దాటేయడం గమనార్హం. తొమ్మిది రోజుల్లోనే కొత్తగా 50వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. లక్షకు చేరడానికి 109 రోజులు పడితే.. 9 రోజుల్లోనే 158,000 దాటేయడం చూస్తే దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్ధమవుతోంది. గడచిన 9 రోజుల నుంచి రోజుకు సగటున 6వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం మరో 6,366 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలో కోవిడ్-19 విజృంభణ ఏ మాత్రం తగ్గడంలేదు. బుధవారం కొత్తగా 2,190 కేసులు నమోదుకాగా.. మరో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని మొత్తం కేసుల్లో 37 శాతం, మరణాల్లో 57 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 56,948కి చేరింది. మొత్తం 1,897 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం దేశవ్యాప్తంగా 185 మంది కరోనాతో చనిపోగా... మొత్తం మరణాల సంఖ్య 4,525గా నమోదయ్యింది. దేశంలో ఒక్క రోజు ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు నమోదుకావడం ఇది రెండోసారి. మే 5 అత్యధికంగా 199 మంది చనిపోయారు. మహారాష్ట్రలో మరణాలు రేటు అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం అధిక మరణాలు సంభవించాయని మహారాష్ట్ర అధికారులు పేర్కొన్నారు, వాటిలో 39 గత రెండు రోజులలోనూ, మిగిలిన 66 ఏప్రిల్ 21 నుంచి మే 24 మధ్య సంభవించినట్టు తెలిపారు. ముంబైలో బుధవారం 32 మరణాలు నమోదు కాగా వాటిలో 21 ఏప్రిల్ 21 నుంచి మే 24 మధ్య సంభవించాయి. గత రెండు రోజుల్లో మహారాష్ట్రలో 202 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల డబులింగ్ రేటు గతవారం 11.5గా ఉందని, ప్రస్తుతం అది 14.7కి చేరిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇక, దేశవ్యాప్తంగా 67,749 మంది వైరస్ నుంచి కోలుకోవడం సానుకూలంశం. మొత్తం కేసులతో పోలిస్తే రికవరీ రేటు 44 శాతంగా ఉంది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో బుధవారం అత్యధికంగా 817 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఢిల్లీ, గుజరాత్‌లు 15వేల మార్క్‌ను దాటాయి. బుధవారం ఢిల్లీలో 792, గుజరాత్‌లో 376 కొత్త కేసులు నమోదు కావడంతో 15,257, 15,205కి చేరింది. గుజరాత్‌లో మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. బుధవారం మరో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాలు 938కి చేరాయి. ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే 764 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఐదో విడత లాక్‌డౌన్ కూడా గుజరాత్‌లో ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య 7,000 మార్క్ దాటేసింది. బుధవారం కొత్తగా 269 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా..అక్కడ మొత్తం మరణాల సంఖ్య 177కి చేరింది. రాజస్థాన్, కర్ణాటకలలో మూడు, జమ్మూ కశ్మీర్ ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానాలో ఒక్కొక్క మరణాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 134 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఒక్క రోజు నమోదయిన కేసుల్లో ఇదే అత్యధికం. తెలంగాణలోనూ 104 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోనూ తొలిసారి 100కిపైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అసోంలో 92 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 774కి చేరింది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3gvXwpG
Comments
Post a Comment