గంటకు 300 మందికే అనుమతి.. జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం?

కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు కేంద్రం పొడిగించినా.. మరిన్ని సడలింపులను ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 8 నుంచి ఆలయాలు, ప్రార్ధనా స్థలాలను తెరవడానికి అనుమతించిన దృష్ట్యా ఆలయాల్లో గంటకు 300 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అది కూడా అంతరాలయంలోకి ప్రవేశం లేకుండా కేవలం లఘు దర్శనానికే మాత్రమే పరిమితం చేస్తారు. ఆలయాల్లో దర్శనాలకు అనుమతిస్తూ.. కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై దేవాదాయ శాఖ పలు మార్గదర్శకాలను రూపొందించి వైద్యారోగ్య శాఖ అనుమతి కోసం పంపింది. వైద్యారోగ్య శాఖ వీటిని ఆమోదించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆలయాల దర్శన సమయాలను స్థానిక పరిస్థితులను బట్టి కార్యనిర్వాహక అధికారులు నిర్ణయించాలి. భక్తులు ముందుగానే బుక్‌ చేసుకుంటే టైమ్‌ స్లాట్‌ దర్శనం కేటాయిస్తారు. దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు తన వెంట ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. నిత్య కళ్యాణం, రాహు, కేతు పూజలు, వ్రతాలు, హోమాలు తదితర క్రతువులకు సంబంధించి గతంలో అనుమతించే భక్తుల సంఖ్యలో 30 శాతం మందినే అనుమతించాలి. కాటేజీల్లోని ఒక గదిలో ఇద్దరు బస చేసేందుకు మాత్రమే అనుమతివ్వాలి. ఒకదాన్ని వదిలి మరొకటి చొప్పున ఉన్నవాటిలో మొత్తం 50 శాతం గదులనే భక్తులకు కేటాయించాలి. కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించే దగ్గర క్షురకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయ ప్రాంగణంలోని దుకాణాలను ఒకదాన్ని విడిచి మరోటి తెరిచేందుకు అనుమతివ్వాలి. అన్నదానం, నిత్యాన్నప్రసాదం ఉండదు. ఆలయాల సమీపంలోని పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతించవద్దు. కాగా, జూన్ 8 నుంచి శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తెరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఐదో విడత లాక్‌డౌన్‌లో ఆలయాలను తెరవడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు కరెంట్ బుకింగ్, ఆన్‌‌లైన్ ద్వారా టైమ్ స్లాట్ టిక్కెట్లు జారీచేయనున్నారు. తిరుమలకు వచ్చేవారికి తప్పనిసరిగా మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3eAAcFg

Comments