విజయవాడ: ఆ ఇద్దరి వల్ల 60మందికి కరోనా.. ఆ 25మందికి పాజిటివ్ ఎలా?

విజయవాడను కరోనా వణికిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతోంది. కృష్ణాజిల్లాలో మొత్తం 177 కేసులు నమోదైతే. 140 యాక్టివ్ కేసులు ఉండగా.. జిల్లాలో 8మంది చనిపోయారు. అందులో విజయవాడలోనే 150 కేసులు ఉన్నాయి. ఆదివారం నమోదైన 52 కేసుల్లో విజయవాడలో 47 నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసులపై అధికారులు ఆరా తీస్తే వెనుక కీలక విషయాలు బయటపడుతున్నాయి. విజయవాడలో 60 కేసులకు ఇద్దరు వ్యక్తులు కారణమట. కృష్ణలంకకు చెందిన ఓ లారీ డ్రైవర్‌ వల్ల 24 మందికి పాజిటివ్‌ వస్తే.. మాచవరం కార్మికనగర్‌కు చెందిన యువకుడి వల్ల 36 మందికి కరోనా వచ్చిందట. అతడు నిర్వహించే టిఫిన్ సెంటర్‌కు వచ్చిన వారికి పాజిటివ్ తేలిందట. ముందు యువకుడికి పాజిటివ్ తేలగా.. తర్వాత నిర్వహించిన పరీక్షల్లో మరో 36మందికి పాజిటివ్ వచ్చిందట. ఆదివారం నమోదైన 47 కేసుల్లో కార్మికనగర్‌లో 20, కృష్ణలంకలో 7, గాంధీనగర్‌లో 5, మధురానగర్‌లో 4 ఉన్నాయి. మిగిలిన 11 కేసులు విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేకాదు విజయవాడలో ఉన్న ఏపీ రాజ్‌భవన్‌లో నలుగురికి పాజిటివ్‌గా నిర్థారణ కావడం కలకలంరేపింది. వీటిలో కూడా చిత్ర, విచిత్రమైన కాంటాక్ట్‌లు ఉన్నాయి. కృష్ణలంకలో నమోదైన 7 కేసులు ఒ కే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారట. అలాగే ఓ వృద్ధురాలి అంత్యక్రియల్లో పాల్గొన్న ఐదుగురికి పాజిటివ్ తేలిందట. కొన్ని పాజిటివ్ కేసులు ఎలా వ్యాపించాయో కూడా అర్ధంకాని పరిస్థితి ఏర్పడిందట. విజయవాడలో కరోనా కేసులు పెరగడం సంచలనం రేపుతోంది. చాలా ప్రాంతాలు రెడ్‌జోన్ పరిధిలోకి వెళ్లాయి. నగరవాసులు భయంతో వణికిపోతున్నారు. కొన్ని కేసులకు కాంటాక్ట్‌లు తేలకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది స్థానికులు ముందస్తు జాగ్రత్తగా తమ ప్రాంతాలకు కొత్తవారిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2VGeOrS

Comments