శ్రీకాకుళం జిల్లాలో కరోనా ల్యాబ్.... 4కు చేరిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లా మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. గత మూడు రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాని శ్రీకాకుళం జిల్లలో కూడా శనివారం మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. శ్రీకాకుళంలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. రాపిడ్‌, ట్రూనాట్‌ కిట్‌ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు శనివారం మూడు నమోదు కాగా, ఆదివారం మరో కేసు నమోదైందని తెలిపారు. కరోనా వైరస్ సోకిన ముగ్గురు కంచిలి మండలం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆ ముగ్గుర్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కూడా కొన్ని రోజుల క్రితం కువైట్ నుంచి తిరిగి వచ్చినట్లుగా తెలిపారు. తాజాగా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరడంతో ఆదివారం మంత్రి జిల్లాలో పర్యటించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పాతపట్నం మండలంలోని కాగువాడ, సీది గ్రామాల్లో పర్యటించారు. క్వారంటైన్‌ కేంద్రాలలో పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలు జిల్లాలోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆళ్ల నాని. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 81 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1097 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 835 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 3,576 మందికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. జిల్లాకు 1,445 మంది విదేశాల నుంచి వచ్చారని, వీరితో 4,271 మంది కాంటాక్టు అయ్యారని తెలిపారు. ఢిల్లీ నుంచి 230 మంది, ముంబయి నుంచి 488 మంది జిల్లాకు చేరకున్నారని, వారందరినీ క్వారంటైన్‌కు తరలించామన్నారు. గుజరాత్‌లో చిక్కుకున్న 3,861 మత్స్యకారులను రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాటు చేశామన్నారు మంత్రి.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3cMP0Qr

Comments