నెల రోజుల్లోనే 10 నుంచి 1,000కి చేరిన కరోనా కేసులు.. ఆ విషయంలో ఏపీ టాప్

ఆంధ్రప్రదేశ్‌లో కేసుల రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,016కి చేరింది. ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదుకాని శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి మూడు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. పాతపట్నం మండలానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురికి వైరస్ సోకినట్టు తేలింది. ఢిల్లీ నుంచి వచ్చిన యువకుడి కుటుంబ సభ్యులతో పాటు అతడితో సన్నిహితంగా ఉన్నవారిని అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. దీంతో విజయనగరం మినహా ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాలకూ కరోనా విస్తరించినట్లయింది. అయితే, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా విస్తృతంగా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన 61,266 మందికి పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ విషయంలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 25 ఉదయం 10 గంటల వరకు జిల్లాల వారీగా చేసిన పరీక్షల ఆధారంగా ఈ వివరాలు నిర్ధారించినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున తెలిపారు. అటు, రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నెల రోజుల్లో 100రెట్లకుపైగా పెరిగాయి. మార్చి 25 నాటికి 10 కరోనా కేసులుండగా, ఏప్రిల్‌ 25 నాటికి 1,016కి చేరుకున్నాయి. అంటే పాజిటివ్ కేసులు 101.5 రెట్లు పెరిగినట్టు లెక్క. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల్లో, ఏపీలో నమోదైన కేసుల శాతమూ పెరిగింది. కేంద్రప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ covid19india.orgలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 25 నాటికి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 657గా నమోదు కాగా... వాటిలో ఆంధ్రప్రదేశ్ కేసులు 1.52 శాతం. ఏప్రిల్‌ 25 నాటికి దేశంలో నమోదైన కేసులు 25,313 కాగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 4.01 శాతంగా ఉంది. మరోవైపు, వైద్య ఆరోగ్యశాఖలోని ఓ ఉద్యోగికి కూడా వైరస్ బారినపడ్డాడు. రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో చిరుద్యోగికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. అలాగే, విజయవాడలోని కరోనా వైరస్ రాష్ట్ర కంట్రోల్‌ రూమ్‌లోని ఆ సంస్థ కార్యాలయాన్ని రెండు వారాల కిందట సందర్శించిన ప్రైవేటు బయోమెడికల్‌ ఇంజినీర్‌ ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఎండీ సహా అక్కడ 85 మందికి శుక్రవారం వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో చిరుద్యోగికి పాజిటివ్‌ రావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎండీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కర్నూల జిల్లాలో అత్యధికంగా 275 మందికి వైరస్ సోకింది. తర్వాతి గుంటూరు (209), కృష్ణా (127), చిత్తూరు (73), నెల్లూరు (73), కడప (55), ప్రకాశం (53), అనంతపురం (51), పశ్చిమ గోదావరి (39), తూర్పుగోదావరి (37), విశాఖపట్నం (22) శ్రీకాకుళం (3) ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31కి చేరింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత కృష్ణా 8, అనంతపురం 4, నెల్లూరు ఇద్దరు ఉన్నారు. మొత్తం 171 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/354TC1C

Comments