దేశంలో 1347కి చేరిన కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే 230కిపైగా నిర్ధారణ

దేశంలో మహమ్మారి శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్నకేసులను చూస్తే సామూహిక వ్యాప్తి దశకు వైరస్ చేరుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 200కుపైగా కొత్త కేసులు నమోదు కాగా, దాదాపు 11 మంది మృతిచెందారు. అయితే, దేశంలో కరోనా వైరస్ ఇంకా సమూహాలలో వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. స్థానిక సంక్రమణ దశలోనే ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా సోమవారం కొత్తగా 227 మందిలో కరోనా నిర్ధారణ అయింది. దీంతో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,251కి చేరింది. దేశంలో కరోనా మృతుల సంఖ్య 35కు చేరుకోగా, అత్యధికంగా మహారాష్ట్రలో 9, గుజరాత్‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, అనధికారికంగా 1,347 కేసులు నమోదు కాగా, 43 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, భారత్‌లో కరోనా వ్యాప్తి లిమిటెడ్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ దశకు చేరుకుందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారి తీసింది. పరిస్థితులు విషమిస్తున్నాయనడానికి ఇది సంకేతమని వివిధ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా ఆరుగురిలో కరోనా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 77కు చేరింది. సోమవారం నమోదైన కరోనా కేసుల్లో మూడేళ్ల బాలిక సహా కరీంనగర్‌కు చెందిన తల్లి, కుమార్తె ఉన్నారు. కరీంనగర్‌‌లో పర్యటించిన 10 మంది ఇండోనేసియా పౌరులు, వారితో తిరిగిన యువకుడు గతంలో ఈ వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ యువకుడి తల్లి, సోదరికి వైరస్ సోకింది. చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకున్న 13 మంది బాధితులను సోమవారం డిశ్చార్జ్ చేశారు. వీరితో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 14కు చేరింది. అలాగే కరోనాతో 6 గురు మృతి చెందగా.. ప్రస్తుతం 56 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త కలకలం చెలరేగింది. ఢిల్లీలోని మతపరమైన సమావేశంలో పాల్గొని వచ్చిన వారు కరోనాతో మరణించడంతో ఉభయ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మార్చి 1 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని తబ్లిగ్‌-ఏ-జమాత్‌ అనే సంస్థ మతపరమైన కార్యక్రమం నిర్వహించింది. దీనికి వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణల్లోని అనేక జిల్లాల నుంచి పలువురు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో నమోదయిన కేసుల్లో వీరే అధికంగా ఉన్నారు. విజయవాడకు చెందిన భార్యాభర్తల్లో... భార్య ఆదివారం, భర్త సోమవారం మరణించారు. వారి కుమారుడు ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అతడి తల్లిదండ్రులు మరణించినట్లు సమాచారం తెలియడంతో అధికారులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 23కు చేరింది. సోమవారం కేరళలో అత్యధికంగా 32 కేసులు నమోదు కాగా, తమిళనాడు, మహారాష్ట్రలో 17, ఢిల్లీలో 25, ఉత్తరప్రదేశ్ 19, గుజరాత్ 7, మధ్యప్రదేశ్ 8, కర్ణాటక 7, తెలంగాణ 6, ఏపీలో 3 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 35 మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో తొమ్మిది, గుజరాత్ ఏడు, తెలంగాణలో ఆరు, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్ 2, ఢిల్లీ 2, రాజస్థాన్ 1, కేరళ, జమ్మూ కశ్మీర్ తెలంగాణ, పశ్చిమ్ బెంగాల్, పంజాబ్‌లో ఒక్కొక్కరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర 238, కేరళ 234, ఢిల్లీ 97, ఉత్తరప్రదేశ్‌ 96, కర్ణాటక 91,లడఖ్ 13, తెలంగాణ 77, రాజస్థాన్ 79, జమ్మూ కశ్మీర్‌ 49, గుజరాత్ 70, ఆంధ్రప్రదేశ్ 23, తమిళనాడు 67, మధ్యప్రదేశ్ 47, పంజాబ్ 41, హర్యానా 36, పశ్చిమ్ బెంగాల్ 22, బీహార్ 15, అండమాన్ నికోబార్ దీవులు 9, మిగతా రాష్ట్రాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,100 కేసుల్లో 59 మందికిపైగా విదేశీయులు ఉన్నట్టు పేర్కొంది.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2UQ1MpQ

Comments