ఆదివారం తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో భయాందోళనకు గురయిన జనం.. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బస్వాపురం, పాతర్లపాడు గ్రామాలు, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లోనూ, కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున 2.37 గంటల సమయంలో 3 నుంచి 6 సెకన్ల పాటు భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని స్థానికులు పేర్కొన్నారు. ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. ఏడేళ్ల కిందట జనవరి 26న కూడా ఖమ్మంలోని పాతర్లపాడు, నాగులవంచ తదితర గ్రామాలలో భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, బెల్లంకొండ పరిసరాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించినట్లు తెలుస్తోంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల, రావిరాలలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఇలాంటి ప్రకంపనలు సర్వసాధారణమే అని జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగదని వారు తెలుపుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 8న ఖమ్మం జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 8 రాత్రి 11.23 గంలకు భూమి ఐదు సెకెన్లపాటు కంపించింది. కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలంలో భూప్రకంపనలు సంభవించాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2tQF0Vs
Comments
Post a Comment