భారత్ ఎఫెక్ట్.. ఐరాసలో పాక్ రాయబారిపై వేటు

ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిని ఇమ్రాన్ ఖాన్ మార్చేశారు. మలీహా లోధీ స్థానంలో మునీర్ అక్రమ్‌ను నియమించారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనను ముగించుకొని ఇస్లామాబాద్ చేరుకున్న రెండు రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఐరాస జనరల్ అసెంబ్లీలో కశ్మీర్ అంశాన్ని ప్రధానాస్త్రంగా చేసుకొని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఐరాసలో పాక్ రాయబారిగా మునీర్ అక్రమ్‌ను రెండోసారి పంపిస్తుండటం గమనార్హం. 15 ఏళ్ల క్రితం ఆయన ఐరాసలో పని చేశారు. డొమెస్టిక్ వయొలెన్స్ కేసు కారణంగా మునీర్ అప్పట్లో ఐరాసలో పదవిని వదులుకున్నారు. కశ్మీర్ సమస్యను పాకిస్థాన్ అంతర్జాతీయం చేయాలని ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో లోధీ పనితీరు పట్ల ఇమ్రాన్ ఖాన్ అసంతృప్తితో ఉన్నారని అందుకే ఆయన్ను మార్చేశారని తెలుస్తోంది. ఐరాసలో కశ్మీర్ అంశంపైనే ప్రధానంగా మాట్లాడిన ఇమ్రాన్.. కర్ఫ్యూ ఎత్తేసిన తర్వాత కశ్మీర్‌లో రక్తపాతం చోటు చేసుకుంటుందని హెచ్చరించారు. కశ్మీర్‌పై భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాకిస్థాన్ చైనా సహకారం తీసుకున్నప్పటికీ మిగతా దేశాల మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. ఇమ్రాన్‌ను అంతర్జాతీయ సమాజం పట్టించుకోలేదు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి తమకు మద్దతు కొరవడిందని ప్రసంగానికి ముందే ఇమ్రాన్ అంగీకరించారు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2o4ahAO

Comments