ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ గురువారం సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలోని ఐటీడీఏల పరిధిలో ఉన్న 7 ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు. అదే విధంగా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం, పాడేరులో గిరిజన మెడికల్ కాలేజీ, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమీక్ష సమావేశం సందర్భంగా చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టిన ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ పథకం గురించి ప్రస్తావనకు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ, ఇబిసి వర్గాలకు చెందిన పేద అభ్యర్థులకు సివిల్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడం కోసం ఏర్పాటు చేసిన ఈ స్కీమ్ నిరూపయోగంగా మారిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ పథకం కింద నాలుగేళ్లలో 9775 మందికి సివిల్స్ శిక్షణ ఇచ్చామని, కేవలం ఒకరు మాత్రమే ఎంపికయ్యారన్నారు. అధికారుల మాటలు విన్న సీఎం జగన్ ఫలితం లేనప్పుడు పథకం అవసరమా? అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. జగన్ వ్యాఖ్యలను బట్టి ఈ పథకాన్ని నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి వైఎస్ఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు. ఇప్పటి వరకు కోచింగ్ సెంటర్లకు ఉన్న డిమాండ్‌ను బట్టి ప్రభుత్వం ఒక్కో అభ్యర్థికి రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు చెల్లిస్తోంది. భోజన, వసతి సదుపాయాల కోసం స్టైఫండ్‌ను కూడా అందిస్తోంది. ఢిల్లీ, బెంగుళూరు లాంటి నగరాల్లో కోచింగ్ తీసుకునే వారికి నెలకు రూ. 12 వేలు, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ఉంటూ శిక్షణ పొందే వారికి నెలకు రూ. 10 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2ZpsRFr
Comments
Post a Comment