సిక్కోలు బాలిక ప్రతిభ.. ప్రధానితో కలిసి చంద్రయాన్-2 చూసే అవకాశం!

సిక్కోలు ప్రతిభ మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం గురించి నిర్వహించిన ఓ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో ప్రతిభచూపిన విద్యార్థులను ఎంపికచేసి, వారిని ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి చంద్రయాన్-2 చంద్రుడిపై దిగే అవకాశాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పోటీ పరీక్షలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని ప్రగడ కాంచనబాలశ్రీవాసవి 20 ప్రశ్నలకు కేవలం 10 నిమిషాల్లో సమాధానం ఇచ్చింది. దీంతో పోలాకి మండలం తలసముద్రానికి చెందిన కాంచనబాల దృష్టిని ఆకర్షించింది. బెంగళూరులోని ఇస్రో ట్రాకింగ్‌ సెంటర్‌లో సెప్టెంబరు 7 న ప్రధానితో కలిసి చంద్రయాన్‌-2 రోవర్‌ చంద్రుడి మీద దిగే దృశ్యాలను వీక్షించనుంది. ప్రస్తుతం పోలాకి మండలం ఈదులవలస ఆదర్శ పాఠశాలలో కాంచనబాలశ్రీ పదోతరగతి చదువుతోంది. దేశవ్యాప్తంగా అతి కొద్దిమందికే ఈ అవకాశం దక్కగా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ బాలికకు అవకాశం రావడం విశేషం. ఈ పోటీ పరీక్షను ఆగస్టు 10 నుంచి 20 అర్ధరాత్రి వరకు నిర్వహించారు. కేవలం పది నిమిషాల్లో 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనే నిబంధన విధించారు. అంతేకాదు, ఒక్కసారి పోటీ ప్రారంభమయ్యాక మధ్యలో ఆపడం కుదరదు. కంప్యూటర్‌ స్క్రీన్‌పై వచ్చిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వాలి. జవాబు తెలియకపోతే తర్వాత ప్రశ్న తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంలో వేగం, కచ్చితత్వంతో పాటు స్పందించే మనస్తత్వం ఉన్న విద్యార్థులు పోటీలో పాల్గొనగా, ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రతిభావంతులను ఎంపిక చేశారు. సరైన సమాధానాలు ఇచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉండగా, వారిలో అతి తక్కువ సమయంలో జవాబులు ఇచ్చిన విద్యార్థులను పరిగణనలోకి తీసుకున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/34i6DUy

Comments